- విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: వి. బాలకిష్టారెడ్డి
- టీశాట్ ఆఫీసులో సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో భేటీ
హైదరాబాద్, వెలుగు: టీశాట్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన బాధ్యతలకు అనుగుణంగా విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికీ నాణ్యమైన విద్యను టీశాట్ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
52 మాడ్యూల్స్ లో ఉన్నత విద్యకు సంబంధించిన కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు. సోమవారం టీశాట్ ఆఫీసును ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ. పురుషోత్తం, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి ఆయన సందర్శించారు. టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. టీశాట్ పనితీరు, స్కూల్, ఇంటర్మీడియెట్, పోటీ పరీక్షలకు కంటెంట్ క్లాసులను నిర్వహించే తీరును వారికి వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఉన్నత విద్యలో భాగమైన యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కు సంబంధించిన కంటెంట్‌ను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పేందుకు టీశాట్‌ను వినియోగించుకోవాలని కోరారు.
అందుకు అనుగుణంగా ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుందామని అన్నారు. ఉన్నత విద్యామండలి విడుదల చేసే పరీక్షా ఫలితాలను టీశాట్ వెబ్సైట్ ద్వారా విడుదల చేయాలని బాలకిష్టారెడ్డిని వేణుగోపాల్ రెడ్డి కోరగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం టీశాట్ ఆఫీసు, స్టూడియో, వివిధ విభాగాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పరిశీలించారు.